ఇంద్రవెల్లి : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర ఆదివారం అర్ధ రాత్రి నుంచి వైభవంగా ప్రారంభం కానుంది.

అరాధ్యదైవం నాగోబా దేవతకు ఆదివారం మెస్రం వంశీయులు అర్థరాత్రి మహాపూజ నిర్వహించి అనంతరం నాగోబా జాతర మొదలవ్వనుంది. ఇప్పటికే జాతర కోసమని జన్నారం మండలం హస్తినమడుగు నుండి సేకరించిన పవిత్ర గంగాజలం తీసుకొచ్చారు మెస్రం వంశస్తులు.కేస్లాపూర్ గ్రామంలోని మురాడీ నుంచి పురాతన నాగోబా విగ్రహంతోపాటు పవిత్ర గంగాజలంతో మెస్రం వంశీయులు నాగోబా ఆలయానికి చేరుకున్నారు. పురాతన నాగోబా విగ్రహాన్ని ఆలయంలోని విగ్రహం వద్ద పేట్టి మొక్కుకున్నారు. నాగోబా ఆలయం వెనుక భాగంలో పవిత్రమైన గంగాజలం ఝరిని భద్రంగా ఉంచారు. అనంతరం మెస్రం వంశీయుల పెద్దలు 22 కీతలకు చెందిన అడపడుచులకు మట్టి కుండలను పంపిణీ చేశారు.
