రుణమాఫీ చేయాలని అడిగినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు, రైతులను అక్రమ కేసులతో వేధింపులకు గురిచేస్తున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి వైఖరిని తీవ్రంగా ఖండించారు.

రుణమాఫీ చేయాలని అడిగిన బీఆర్ఎస్ నాయకులు, రైతులపై గతంలో కేసులు నమోదు చేయగా శుక్రవారం వారు ఆర్మూర్ కోర్టుకు హాజరయ్యారు. రైతులు తమకు న్యాయం చేయాలని, ప్రభుత్వం వెంటనే పూర్తిస్థాయిలో రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేయడం సమంజసమని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వేముల పేర్కొన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో 52వేల మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉండగా కేవలం 22వేల మందికి మాత్రమే చేశారని తెలిపారు.
