వేములవాడలోని సుభాష్‌నగర్‌కు చెందిన వృద్ధురాలు చింతల్‌ఠాణ మల్లవ్వ ఆదివారం ఇంట్లో జారిపడడంతో కాలు విరిగింది. వెంటనే కుటుంబ సభ్యులు వేములవాడ ఏరియా దవాఖానకు తీసుకెళ్లారు. సంబంధిత సేవలు అందుబాటులో లేవని చెప్పడంతో సిరిసిల్ల ప్రభుత్వ దవాఖానకు తీసుకొచ్చారు.

సిరిసిల్ల టౌన్, జూన్ 9 : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్కారు వైద్యం మెరుగుపడింది. అప్పటి మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలో సిరిసిల్ల జిల్లా దవాఖాన వైద్య సేవల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందింది. ప్రభుత్వం మారిన తర్వాత ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. ఇటీవల స్కానింగ్ సేవలు నిలిచి పోవడంతో గర్భిణులు, సంబంధిత రోగులు అవస్థలు పడిన విషయం తెలిసిందే కాగా, ప్రస్తుతం అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.
