పరిపాలనా సౌలభ్యం.. నగర సమగ్రాభివృద్ధి అంటూ.. సర్కారు గొప్పలకు పోయి జనాలను తిప్పలకు గురి చేస్తున్నది.. ఔటర్ వరకు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్)గా ప్రకటించిన సర్కారు.. 27 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీలోకి విలీనం చేసి ‘హైదరాబాద్ మెగా సిటీ’గా మార్చేసింది. ఏడు కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలను విలీనం చేస్తూ.. ప్రభుత్వం రెండు రోజుల కిందట మూడు ఆర్డినెన్స్‌లను జారీ చేసింది.

ఈ పురపాలికలకు సంబంధించిన రికార్డులను జోనల్ కమిషనర్ల పర్యవేక్షణలో స్వాధీనం చేసుకునేందుకు డిప్యూటీ కమిషనర్లకు అప్పగించి.. (నేటితో) 5వ తేదీలోగా ప్రక్రియను పూర్తి చేసే పనిలో ఉన్నారు. అంతేకాకుండా ఈ 27 యూఎల్బీలను విలీనం చేయడం ద్వారా అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన ముగిసింది. ఈ క్రమంలోనే ఈ ప్రాంతాలను జీహెచ్ఎంసీలోకి ఐదు జోన్లలో కలిపారు. అయితే విలీనం ప్రక్రియపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
