
(శ్రీరామ్ చక్రి న్యూస్)16/6/2026 టుడే న్యూస్ బడంగ్పేట్ సర్కిల్: జిల్లెలగూడ చందన చెరువు వద్ద నిరసన.. అధికారులకు హెచ్చరిక,బడంగ్పేట్ సర్కిల్ పరిధిలోని జిల్లెలగూడ చందన చెరువును స్థానిక నాయకులు, వాకర్స్, కాలనీవాసులతో కలిసి సందర్శించారు. చెరువులో నుంచి తీసిన గుర్రపు డెక్కను నెల రోజులుగా వాకింగ్ ట్రాక్‌పై పోసి, తరలించకుండా వదిలేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.చెరువు పరిసరాలను పరిశీలించిన అనంతరం అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడే నిరసన చేపట్టారు. ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ, సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.అక్కడ పనిచేస్తున్న జేసీబీ సిబ్బందిని ప్రశ్నించగా, గత ఇరవై రోజులుగా ఎలాంటి పనులు జరగలేదని వెల్లడించినట్లు తెలిపారు. దీంతో చెరువు అభివృద్ధి పనుల్లో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.వారం రోజుల్లోగా వాకర్స్ ట్రాక్‌పై ఉన్న గుర్రపు డెక్కను తొలగించి, చెరువు పరిసరాలను శుభ్రపరచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వెయ్యి మందికి పైగా వాకర్స్‌తో కలిసి చెరువు రోడ్డుపై భారీ ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.ఒకప్పుడు అందంగా ఉన్న చందన చెరువు ప్రస్తుతం డంపింగ్ యార్డ్‌ను తలపించేలా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆర్కల కామేష్ రెడ్డి, నాయకులు పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సిద్ధాల భరత్, వాకర్స్, కాలనీవాసులు పాల్గొన్నారు.
