జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల గోస తీరడం లేదు. కేవలం ప్రకటనలకే పరిమితమైనట్లుగా ఆయా కేంద్రాల్లో కొలువైన సమస్యలను బట్టి అర్థమవుతుంది. జిల్లా అధికారయంత్రాంగం ఒకవైపు, ఎమ్మెల్యేలు, మంత్రులు మరోవైపు పలు కేంద్రాలను పరిశీలించినా ఎలాంటి మార్పు రావడం లేదు.

ధాన్యం సంచులకు నింపాలన్నా..నింపిన ధాన్యం ఎత్తాలన్నా..లారీలకు, ట్రాక్టర్లకు ఎత్తిన ధాన్యం బస్తాలు దించాలన్నా కూడా పెండింగ్ పడుతున్నాయి. కొనుగోళ్లు చేసిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు స్థలాలు అందుబాటులో లేవు. ఉన్న లిమిటెడ్ గోదాంలో గతేడాది ధాన్యం నిల్వలు ఉండటంతో ఇప్పుడు స్థలాల సమస్య వచ్చింది. తాత్కాలికంగా జిల్లా కేంద్ర సమీపంలో నాగవరం శివారులో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నూతనంగా నిర్మించిన షాదీఖానలోనూ ధాన్యం దించాలని అధికారులు నిర్ణయించడంతో అక్కడికి భారీస్థాయిలో వాహనాలు చేరుకున్నాయి. కొన్ని లారీలతోపాటు సొంతంగా ట్రాక్టర్లలో తూకం వేసిన ధాన్యం బస్తాలను తరలించారు. అయితే, రెండు రోజులుగా షాదీఖానలోనూ సంచులను దించే పనులు నిలిచిపోవడంతో శనివారం రైతులంతా వనపర్తి-కొత్తకోట రోడ్డుపై ధర్నా చేశారు.
