పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి అయిన రేవంత్‌రెడ్డి రెండున్నరేళ్లలో చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సవాల్ విసిరారు. గత కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో చేసిన అప్పును రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే చేసి చూపించిందని విమర్శించారు.

వెలుగుమట్ల భూదాన్ భూముల్లో 820 మంది ఇండ్లు కూల్చివేసి కంటితుడుపు చర్యగా కేవలం 310 మందికి మాత్రమే పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరికీ ఇండ్లు పంపిణీ చేస్తామని అజయ్ హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం 33 శాతం మహిళా బిల్లు ప్రవేశపెడితే.. జిల్లాలో 15 నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉన్నదని, ఈ క్రమంలో వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళలకు పెద్దపీట వేస్తామన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ విషయంలోనైనా మాట్లాడే ధోరణి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నదని, కోటి రూపాయలు ఖర్చుపెట్టి వేల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న మాట వాస్తవమా? కాదా? అని సూటిగా ప్రశ్నించారు.
