కోట్లాది మంది భక్తులు తరలివచ్చే మేడారం మహాజాతర సమయం తరుముకొస్తోంది. ఇంకా కొన్ని గంటల్లో ఉత్సవం ప్రారంభం కానుంది. ప్రభుత్వం నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టినప్పటికీ అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ముందుకు సాగడం లేదు. అమాత్యులు డెడ్లైన్ల వరకే పరిమితమయ్యారు. క్షేత్రస్థాయిలో కలెక్టర్, ఎస్పీ మకాం వేసినా కీలకమైన పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

రేపటి నుంచి నాలుగు రోజుల పాటు మహా జాతరను వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.101 కోట్లను విడుదల చేసి భక్తుల కోసం వివిధ శాఖల ద్వారా అభివృద్ధి పనులను మూడు నెలల క్రితం ప్రారంభించినప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పనులను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు కలెక్టర్‌తో పాటు ఎస్పీ మేడారంలోనే మకాం వేసినప్పటికీ ఇంకా పూర్తికాకపోవడంతో ముందస్తు మొక్కుల నిమిత్తం వచ్చే భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
