
ఎల్బీనగర్, అక్టోబర్ 16 (తెలుగు ప్రభ): నియోజకవర్గ పరిధిలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అధికారులను కోరారు. శుక్రవారం ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహాతోను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు అభివృద్ధి పనులపై చర్చించారు. రెండు రోజుల క్రితం నియోజకవర్గంలోని పలు డివిజన్లలో పర్యటించిన సందర్భంగా తన దృష్టికి వచ్చిన సమస్యలను కమిషనర్కు వివరించారు. అయ్యప్ప కాలనీలో డ్రైనేజీ పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలని కోరారు. ఆటోనగర్ డంపింగ్ యార్డు పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి, ఫుట్పాత్లు నిర్మించాలని సూచించారు. భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలు, వీధి దీపాలు ఏర్పాటు చేయడంతోపాటు రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటాలని కోరారు.

బీఎన్రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని వైదేహి నగర్లో నూతన రహదారుల నిర్మాణం చేపట్టాలని, హరిహరపురం, విజయపురి కాలనీల్లో కొత్త కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా చంపాపేట డివిజన్ పరిధిలోని పవన్పురి కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ వికాస్ మహాతో స్పందిస్తూ అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే పంపించామని, త్వరలోనే పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యేకు తెలిపినట్లు పేర్కొన్నారు.
