ప్రారంభం రోజే ప్రతాపం చూపింది రోహిణి కార్తె. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 48 డిగ్రీల వరకూ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో రోళ్లు పగిలేలా ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం పది గంటలకే ఠారెత్తిస్తున్న ఎండలు.. ఏ ఒక్కరినీ బయటకు రానీయడం లేదు. చల్లదనం లేనిదే ఉండలేని పరిస్థితి.

వాహనాల మీద ప్రయాణించేవారి చర్మం.. కణకణ మండే నిప్పుల్లో కాలిపోతున్నట్లుగా అవుతోంది. సాయంత్రం ఐదు గంటల వరకూ ఇదే స్థాయిలో ఎండ దంచి కొడుతోంది. సాయంత్రం ఏడు గంటల వరకూ వడగాడ్పులు వీస్తున్నాయి. పల్లెలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా మధ్యాహ్నం వేళల్లో ఎక్కడ చూసినా రహదారులన్నీ నిర్మానుషమవుతున్నాయి. ఇంతటి తీవ్రమైన ఎండలు కొడుతుండడంతో వడదెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు.
