వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వానిది మిషన్ మోడ్ కాదు.. కమీషన్ మోడ్ అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు.

సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఉదయం హరీశ్‌రావు సందర్శించారు. కల్లాల్లో రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న రైతుల కష్టాలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వడ్ల కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల లక్షలాది మంది రైతులు ఇవాళ అరిగోస పడుతున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వానికి రైతులంటే పట్టింపు లేదు, లెక్కలేదని అన్నారు. యూరియా సరఫరా, కరెంటు, రైతుబంధు ఇవ్వడంలో ఫెయిల్ అయిన ప్రభుత్వం.. ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లను కొనడంలో కూడా పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
