ఏ కాలనీ చూసినా.. ఏ బస్తీ చూసినా.. ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. మళ్లీ ఉమ్మడి పాలనలోని తాగునీటి కష్టాలు పునరావృతమయ్యాయి.. రోజుల తరబడి నీళ్లందక కొన్ని ప్రాంతాలు.. లో ప్రెషర్ కష్టాలు.. కలుషిత నీటి సరఫరాతో మరిన్ని ప్రాంతాలు.. ఇలా మండుటెండలో ప్రజలు తాగునీటికి అవస్థలుపడుతున్నారు.

భూగర్భ జలాలు పూర్తిగా పాతాళానికి వెళ్లాయి.. ఫలితంగా ఇండ్లలోని బోర్లు సైతం అడుగంటి పోతున్నాయి. ట్యాంకర్లు బుక్ చేసుకుంటే ఇండ్లకు చేరేందుకు మూడు, నాలుగు రోజులు పడుతున్నది. దీంతో ఆగ్రహిస్తున్న నగర ప్రజలు రోడ్డెక్కుతున్నారు. జలమండలి కార్యాలయాలకు ఖాళీ బిందెలతో దండెత్తుతున్నారు. నగర ప్రజల నీటి కష్టాలను చూసి బీఆర్ఎస్ శ్రేణులు వారి నిరసనలకు మద్దతు తెలుపుతున్నారు. శనివారం ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు ఖాళీ బిందెలతో ఖైరతాబాద్ జలమండలి కార్యాలయాన్ని ముట్టడించారు. ఇదేనా ప్రజా పాలన అంటూ.. వివిధ నినాదాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. తీవ్ర స్థాయిలో సర్కార్‌పై విరుచుకుపడ్డారు. ఇతర ప్రాంతాల్లో సైతం తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ..ప్రజాప్రతినిధులు, అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. పదేండ్లలో నగర ప్రజలకు నీటి ఇబ్బందులు రాలేదని బీఆర్ఎస్ పాలనను నగరవాసులు గుర్తు చేసుకున్నారు.
