సన్నధాన్యం రైతును నిలువు దోపి డీ చేసేందుకు రైసు మిల్లర్లు కుట్ర చేస్తున్నారు. ఆరంభంలో మంచి ధర పెట్టి తీరా ధాన్యం ట్రాక్టర్లు బారు లు తీరే సమయంలో ధరను అంతకంతకూ తగ్గించి వేస్తున్నారు.

అదిరించి బెదిరించి మొత్తానికి తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతులను మిల్లర్లు నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇలాంటి సమయాల్లో పరిస్థితిని చక్కదిద్ది అండగా ఉండాల్సిన ప్రభుత్వ పెద్దలు ఇటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో రైతులు నిత్యం రోడ్లెక్కుతున్నారు. యాసంగి వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా సాగర్ ఆయకట్టుతో పాటు ఏఎంఆర్పీ, చుట్టు పక్కల ప్రాంతాల్లో సన్నాలు సాగు చేసిన రైతులంతా పండించిన ధాన్యాన్ని మిర్యాలగూడ ప్రాంత రైసు మిల్లుల్లో అమ్ముకోవడం పరిపాటి. ఇరవై రోజులుగా ధాన్యం రాక మొదలు కాగా గత వారం రోజులుగా ధాన్యం పెద్ద మొత్తంలో తరలివస్తోంది. దీంతో మిర్యాలగూడ పరిధిలోని 90కి పైగా రైసుమిల్లుల వద్ద నిత్యం వందలాది ధాన్యం ట్రాక్టర్లు బారులు తీరుతున్నాయి.
