దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో విజిబిలిటీ జీరోకు పడిపోయింది. అతి సమీపంలో వెళ్లే వాహనాలు కూడా కనిపించని పరిస్థితి. దీంతో రోడ్డు, రైలు, వాయు రవాణా సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దాదాపు 118 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అందులో 60 అరైవల్స్ కాగా, 58 డిపార్చర్స్ ఉన్నాయి. మరో 16 విమానాలను అధికారులు దారి మళ్లించారు. పొగ మంచు పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఎయిర్‌పోర్టుకు వచ్చే ముందు విమాన స్టేటస్‌ను చెక్‌చేసుకోవాలని సూచించింది. మరోవైపు విమానాల రద్దు, ప్రయాణ సమయాల్లో మార్పుల గురించి తెలుసుకోవడానికి తమ అధికారిక వెబ్సైట్లను తనిఖీ చేయాలని విమానయాన సంస్థలు ప్రయాణికులకు సూచించాయి.
