ఆదివారం జరిగిన రెండు అగ్ని ప్రమాదాలు కలవరపెట్టాయి. సోమాజిగూడ రాజ్‌భవన్ రోడ్‌లోని ఓ అపార్ట్మెంట్లో సిలిండర్ పేలి మంటలు ఎగిసిపడ్డాయి. అలాగే మైలార్దేవిపల్లి డివిజన్ టాటానగర్‌లోని ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించాయి

ఖైరతాబాద్, డిసెంబర్ 28 : గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సోమాజిగూడ రాజ్‌భవన్ రోడ్‌లోని ఆల్ఫైన్ హైట్స్ టవర్స్ రెండో బ్లాక్ ఐదో అంతస్తులోని ఫ్లాట్ నం.506లో అలికా మాథూర్ (70), ఆమె కుమార్తె అశిత మాథూర్ (45) మాథూర్‌తో కలిసి నివాసం ఉంటున్నారు. ఆదివారం సాయంత్రం వంట చేసేందుకు స్టవ్ వెలిగించగా, గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాటిని అర్పేందుకు ప్రయత్నించగా సాధ్యం కాలేదు. దీంతో భయంతో బయటకు పరుగులు తీసి చుట్టు పక్కల వారికి చెప్పారు. తక్షణమే పంజాగుట్ట పోలీసులకు సమాచారం అందించగా, అగ్ని మాపక సిబ్బందిని రప్పించారు. నాలుగు ఫైరింజన్ల ద్వారా సుమారు మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
