సర్పంచ్ పదవి గ్రామాల్లో ఊరికి పెద్దగా భావిస్తారు. గతంలో ఈ స్థానంపై కూర్చోవాలంటే మధ్య వయసు దాటిన వారే ఎక్కువగా పోటీ పడేవారు. హుందాతనం, గౌరవ మర్యాదలు ఉండడంతో సర్పంచ్ పదవి అంటే చాలా మందికి మోజు ఉంటుంది.

దశాబ్దాలుగా సర్పంచ్ అనగానే టక్కున గుర్తుకు వచ్చేది పెద్ద వయస్కులు మాత్రమే. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకుండానే పంచాయితీలు తెంపడం, గ్రామంలో ఏ సమస్యకైనా ముందుండే అవకాశం కేవలం సర్పంచ్‌కే దక్కుతుంది. గ్రామ ప్రథమ పౌరుడిగా వచ్చే గుర్తింపు కూడా అంతా ఇంతా కాదు
దశాబ్దాలుగా ఒక రకమైన ట్రెండ్ కొనసాగగా… ప్రస్తుతం కొత్త తరహా తీరు వ్యాప్తి చెందుతోంది. యువతరం మార్పు కోరుకుంటూ రాజకీయాల్లో రాణించేందుకు సర్పంచ్ పదవినే ఆయుధంగా భావిస్తోంది. కలిసి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు రంగంలోకి దిగి సర్పంచ్‌గా గెలిచేందుకు పోటీ పడుతున్నారు. ఊరి జనాల మనసు దోచుకునేందుకు కొత్త తరహా ప్రచార వ్యూహాలతో దుమ్ము రేపుతున్నారు.
