మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో వరుస విచారణలు కలకలం రేపుతున్నవి. ‘బేటీ బచావో.. బేటీ పడావో’లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అక్రమాల గుట్టు ఇంకా తేలక పోవడం, ఇదే విషయమై పదే పదే విచారణలు జరుగడం శాఖలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా, ఉద్యోగులను వేధిస్తున్నారని వరంగల్ ఆర్జేడీకి అందిన ఫిర్యాదుపై కరీంనగర్ అర్బన్ ప్రాజెక్టు కార్యాలయంలో రెండు రోజులుగా విచారణ చేస్తుండగా, శాఖలో విచారణలే గానీ, చర్యలు ఉండవనే చర్చ జరుగుతున్నది.

జిల్లా మహిళా, శిశు సంక్షేమ, వయోవృద్ధుల శాఖ పదిహేనేళ్లుగా అనేక కుంభకోణాలు, అవినీతికి పెట్టింది పేరుగా మారిందన్న ఆరోపణలు గతంలోనే వెల్లువెత్తాయి. మహిళలు, చిన్నారులు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమం కోసం వెచ్చించాల్సిన కోట్ల విలువైన సామగ్రి, సరుకులు పక్కదారి పట్టాయని ఆరోపణలు వచ్చాయి. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకందించే పౌష్టికాహార సరుకులతోపాటు వాటి సరఫరాలోనూ అనేక అవకతవకలు జరిగాయనే ఆధారాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి
