మూడ్రోజుల పాటు వర్ష సూచనలు | పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు

హైదరాబాద్: దక్షిణ అండమాన్ సముద్రాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంపై అల్పపీడనానికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, దీని ప్రభావంతో మంగళవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ అల్పపీడనం వచ్చే 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఈ పరిణామాల నేపథ్యంలో రాబోయే మూడు నుంచి నాలుగు రోజులపాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదైనట్టు తెలిపింది. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో గత 24 గంటల్లో వర్షాలు కురిసినట్టు టీజీడీపీఎస్ పేర్కొంది.
ఆదివారం (అక్టోబర్ 20) నాడు కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు.
సోమవారం, మంగళవారం (అక్టోబర్ 21–22) నాడు పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి.బుధవారం (అక్టోబర్ 23) నాడు వర్షాల ప్రభావం మరింత విస్తరించే అవకాశం ఉంది. కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ కూడా జారీ చేసింది.
ప్రజలు వర్షాల వల్ల సంభవించగల ఆటంకాలపై అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. వడగండ్ల వానలు, ఈదురుగాలుల కారణంగా పంటలకు నష్టం జరిగే అవకాశం ఉన్నందున రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ప్రయాణికులు వర్షపాలిట పడకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని హెచ్చరించింది.
