
మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గుల్ గ్రామ ప్రభుత్వ పాఠశాలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో వర్షపు నీరు నిల్వ ఉండటం గమనించిన ఎమ్మెల్యే గారు, సంబంధిత మున్సిపల్ అధికారులు, డీఈ తదితరులను అక్కడికే పిలిపించి, సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు పక్కా ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తరువాత విద్యార్థులతో సబితా ఇంద్రారెడ్డి గారు మాటామంతీ జరిపి, పాఠశాలలో అందజేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. సన్న బియ్యం ఇవ్వాలి కానీ, దొడ్డు బియ్యాన్ని వాడుతూ విద్యార్థులను మోసం చేస్తున్నారని విమర్శించారు. ‘‘సన్న బియ్యం అందిస్తున్నామని అబద్ధాలతో బ్రతికిస్తున్న రేవంత్ సర్కార్ విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు క్షీణిస్తున్నాయి’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
మధ్యాహ్న భోజనం సరఫరా చేసే వారికి బిల్లులు ఇవ్వకపోవడంతో, వారు స్వంతంగా ఖర్చు పెట్టి పిల్లలకు భోజనం పెడుతున్న పరిస్థితి ఉందని అక్కడి సిబ్బంది ఎమ్మెల్యే గారికి వివరించారు. దీనిపై సబితా ఇంద్రారెడ్డి గారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ‘‘ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి విద్యా వ్యవస్థపై దృష్టి సారించాలని’’ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ కృష్ణయ్య, ప్రధాన ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, నాదర్గుల్ మరియు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు


