మట్టి తవ్వకాలతో పచ్చని చెట్లను కూల్చివేస్తూ నరిగెబందం గుట్టను బొందలగడ్డగా మారుస్తున్నారు. పట్టించుకోవాల్సిన రెవె న్యూ, దేవాదాయశాఖ అధికారులు తమకేమీ తెలియదన్నట్లు ప్రవర్తిస్తుండడంతో రోజూ వందలాది టిప్పర్లతో గుట్టను తవ్వి మట్టిని తరలించుకుపోతున్నారు.

ప్రపంచ ప్రసిద్ధి చెందిన మేడారం జాతర ప్రతి రెండేళ్లకోసారి జరుగుతుంది. ఈ మహాజాతరకు పెరుగుతున్న భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం సమ్మక్క, సారలమ్మ దేవాలయం ఆధ్వర్యంలో భవనాల నిర్మాణానికి, భవిష్యత్ అవసరాల కోసం మేడారం గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిగూడెం సమీపంలో ఉన్న 29ఎకరాల నరిగెబందం గుట్టను దేవాదాయశాఖకు కేటాయించింది.
2026లో జరిగే మహాజాతరకు గద్దెల విస్తరణతో పాటు జాతర పరిసరాల్లోని రోడ్ల విస్తరణకు ప్రస్తుత ప్రభుత్వం నిధులు కేటాయించింది. గద్దెల విస్తరణకు మట్టి అవసరముండడంతో అధికారులు నరిగెబందం గుట్ట నుంచి తీసుకోవాలని అనుమతులిచ్చారు. దీన్ని ఆసరాగా చేసుకొని మేడారంలో జరిగే ప్రతి అభివృద్ధి పనికి ఈ గుట్ట నుంచే మట్టిని తరలిస్తుండడంతో విలువైన భూమి బొందలుగా మారడంతో పాటు అడ్డుగా వచ్చిన భారీ వృక్షాలను సైతం నేలకూలుస్తూ మట్టిని తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత దేవాదాయశాఖ, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో విలువైన భూమి బొందలగడ్డగా మారుతున్నది.
