మొంథా తుఫాన్ అక్టోబర్, నవంబర్ నెలల్లో విరుచుకుపడింది. ఉమ్మడి జిల్లాలపై ప్రభావం చూపింది. వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. చేతికొచ్చే దశలో నీటిలో మునుగగా, అప్పటికే కోతలు పూర్తయి చేసిన వరి కుప్పలు కొట్టుకుపోయా

అన్నదాతకు కన్నీరే మిగిలింది. అప్పుడు పంట దెబ్బతిన్న రైతులకు ఎకరానికి 10వేల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం, సర్వేకు ఆదేశించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వ్యవసాయ అధికారులు సర్వే చేసి, పంట నష్టం లెక్క తేల్చారు. ప్రభుత్వానికి కూడా నివేదించారు. ఒక్క చిగురుమామిడి మండలంలో 1793 ఎకరాల్లో వరి, సైదాపూర్ మండలంలో 2448.16 ఎకరాల్లో వరి, 75.16 ఎకరాల్లో పత్తి, ఆరెకరాల్లో మక్కకు నష్టం జరిగినట్టు తేల్చారు. సర్వే చేసి నెలలు గడుస్తున్నా సర్కారు మాత్రం పరిహారం అందించకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. పరిహారం అందిస్తే తమకు ఎంతో కొంత సాయమయ్యేదని చెబుతున్నారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి పరిహారం అందించాలని వేడుకుంటున్నారు.
