‘కూలీ నాలీ చేసి పైసా పైసా పోగు చేసి.. ఊర్లో భూములు అమ్ముకొని.. ప్లాట్లు కొనుగోలు చేసి.. గూడు కట్టుకుంటే రియల్ వ్యాపారుల కన్ను పడిందని.. ముఖ్యమంత్రి సోదరుల అండదండలతో రియల్ వ్యాపారులు గుండాలతో వచ్చి నిద్రలో ఉన్న మమ్మల్నీ లేపి తెల్లవారుజామున ఇండ్లు కూల్చివేశారని గిరిజనులు కన్నీరు మున్నీరయ్యారు.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్దమంగళారం రెవెన్యూలో 210, 211, 212 సర్వే నంబర్లలో రాఘవేంద్ర కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ 1986లో 16 ఎకరాల భూమిని కొనుగోలు చేసి వెంచర్ చేశారు. అప్పటి నుంచి వినియోగదారులు 2023 వరకు కూడా ప్లాట్లు కొనుగోలు చేస్తూ వచ్చారు. అయితే పాత మహబూబ్నగర్ జిల్లాకు చెందిన 50 గిరిజన కుటుంబాలు తమ సొంత గ్రామాల్లో తనకు ఉన్న భూములను అమ్ముకొని నాలుగేండ్ల నుంచి రాఘవేంద్ర కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ప్లాట్లు కొనుగోలు చేస్తూ వచ్చారు.
