రంగారెడ్డిజిల్లాలోని విలువైన భూములు జిల్లా ఆదాయంపై కన్నేసిన కాంగ్రెస్ సర్కారు.. జిల్లా అస్తిత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. శంషాబాద్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అధ్యక్షతన దీక్షా దివస్ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ నెల 29న జరిగే దీక్షా దివస్ విజయవంతం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ముఖ్య అతిథిగా హాజరైన సబితారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ఏకపక్షంగా జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని క్యాబినెట్ నిర్ణయించడం జిల్లా ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. జిల్లా ప్రజల అభిప్రాయాలను తీసుకోకుండా క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రజా వ్యతిరేక చర్య అని ఆమె విమర్శించారు. ఆర్థికంగా పరిపుష్టమై ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న శివారు ప్రాంతాలకు ప్రభుత్వ నిర్ణయం అశని పాతంగా మారిందన్నారు. ఈ నిర్ణయంతో పేద, మధ్యతరగతి ప్రజలపై ఆర్థికంగా పెనుభారం పడుతుందని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో ఇంటి పన్నులు, నల్లా బిల్లులు, ఇతర చార్జీలు అడ్డగోలుగా పెరుగుతాయన్నారు.
