
హైదరాబాద్, నవంబర్ 1 (శ్రీరామ్ చక్రి న్యూస్):
అఖిలపక్షాల మద్దతుతో బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (బీసీ జేఏసీ) కట్టుబడి ఉందని రాష్ట్ర బీసీ జేఏసీ చైర్మన్ ఆర్. కృష్ణయ్య తెలిపారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 65 కుల సంఘాలు ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నాయని తెలిపారు.

బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే బీసీ జేఏసీ భారీ స్థాయిలో ఆందోళనలు చేపడుతుందని హెచ్చరించారు. ఈ పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో సహకరించాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు.

రాష్ట్ర బీసీ జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ గుజ్జ సత్యం మాట్లాడుతూ, బీసీ సమాజ హక్కుల కోసం ప్రతి జిల్లాలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. బీసీ జేఏసీ సమాన హక్కుల కోసం నిరంతర పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
