

హైదరాబాద్: ఢిల్లీలో అక్టోబర్ 10 నుండి 12 వరకు జరిగిన 9వ అంతర్జాతీయ జూనియర్ స్థాయి ఘట్కా పోటీలలో తెలంగాణ ఆటగాళ్లు ప్రతిభ చూపారు. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల నుండి వచ్చిన 1200 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో, తెలంగాణ తరపున 19 మంది పోటీలో పాల్గొన్నారు.
ఈ పోటీల్లో తెలంగాణకు అండర్-11 బాలుర విభాగంలో ధ్రువ సిద్ధ, వైధిక్, అర్ణవ్ మరియు అండర్-17 బాలికల విభాగంలో దివ్య శ్రీ, ధాత్రిక, దీక్షితలు రజత పతకాలు సాధించి రాష్ట్ర ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటారు.
ఈ సందర్భంగా ఘట్కా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (GFI) నిర్వాహకులు మాట్లాడుతూ, “తెలంగాణ ప్రతీ సంవత్సరం ఘట్కాలో ఉత్తమ ప్రదర్శన చేస్తోంది,” అని ప్రశంసలు కురిపించారు.
పతకాలపై స్పందించిన తెలంగాణ ఘట్కా అసోసియేషన్ అధ్యక్షురాలు రాజేశ్వరి, కోచ్ మరియు కార్యదర్శి రాజేష్ చారీ, కన్వినర్ రఘు శ్రీ, హైదరాబాద్ జిల్లా ఇంచార్జీలు స్వర్ణ, కౌశిక్, ఉమ్మడి పాలమూరు జిల్లా ఇంచార్జిగా ఉన్న గడ్డంపల్లి శశివర్ధన్ రెడ్డి Telangana విజయం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.


